కవితలు

ఎద లయలో అలజడులు ...

Friday, February 15, 2008

ఆకాంక్ష

ప్రియతమా..

నీ చిలిపి కనులలో నా రూపమే కదలాడాలనీ ...
విప్పారిన నీ పెదవులు నన్నే పిలవాలనీ ...
నీ చిరుదరహాసమై నే వెలగాలనీ ...
నువు కురిపించే అనురాగామ్రుత వర్షంలో,
నీ అభిసారికనై తడవాలనీ ....
నిఛ్వాస లేని ఉఛ్వాసనై నీ గుండెలో ఒదగాలనీ ...
నీ ఒడిలో తలవాల్చి నా తుది శ్వాస వదలాలనీ ...

అంబరాన్నంటే నా ఆరాధనలో,
అన్నీ ఆకాంక్షలే ...
నీకై నేను అల్లిన మాలలే !

Tuesday, August 29, 2006

నీ జీవన సహచరినై...


పరుగులెత్తీ ప్రవహించీ సముద్రంలో కలిసిన నదిలా
ఎగిరి ఎగిరి అలసి సంజవేళ గూటికి చేరిన గువ్వలా
వేసవి వేడి తాళలేక చెట్టు నీడని ఆశ్రయించిన బాటసారిలా
నిను చేరాను నేను, సహచర్యం కోరుతూ ..
నీ కౌగిలిలొ కరిగిపోయానో ....నీ గుండెలో వొదిగి పోయానో ...!!
నీ దరిలో దిగులంతా దూరమై,
కలలే కమనీయమై
తనువంతా హరిచందనమై
మనసే పునీతమై ..
కలిసి నడుస్తున్నాను నీతో ...
ప్రతి అడుగూ పరవశాన ..
నీ కన్నుల వెన్నెలనై
నిను అల్లిన మాలతినై
నీ జీవన సహచరినై ...!!!

Friday, July 07, 2006

వేచివుంటా వేయి కనులతో


హద్దులు చెరిపావ్ ముద్దులతో
తిరిగిచ్చాను పద్దులతో
యుద్ధం చేస్తూ పొద్దులతో
జతచేరిన మునిమాపులతో
ఎగిరొచ్చేయ్ నిషీధి రెక్కలతో
వేచివుంటా వేయి కనులతో ...

Friday, June 30, 2006

ఎపుడూ

గుర్తొస్తావ్ ప్రతి ఉదయాల్లో..
అపరాహ్ణం, సంజవేళల్లో..
అదిగో వచ్చావ్ నిద్దట్లో ..
ఎపుడూ వుంటావేం నా ఊహల్లో?

Good Night

అరవిప్పారిన పెదవుల వెంట,
చెప్పీ చెప్పని పదముల జంట
తగిలీ తగలని శ్వాసలలో ..
నిషీధి గడిచె నిట్టూర్పులలొ...

పరిచయం


పరిచయమయింది మూన్నాళ్ళుగానే అయినా ..
మనసు తను తెలుసంటోంది చాన్నాళ్ళుగా!
కబుర్లలో కాలమే కదలిపోనీ ..
చల్లని చెలిమై మిగిలిపోనీ ..
తన గతంలో ఓ తీయని స్మృతినై ఒదిగిపోనీ ...

జాడ లేవేం జాబిలి?

జాడ లేవేం జాబిలి?
వేచి వున్నది నీ చెలి !

వొడలంతా కనులుగా..
మనసంతా దిగులుగా..
వేచి వున్నది నీ చెలి
జాడ లేవేం జాబిలి?

కొమ్మరెమ్మలు కదలాడినా ...
నీ పిలుపులా ఆలాపన
కనులలో నీ రూపమే,
కళ్ళెదుట నిలిచిన భావన

రెండు ఝాములు గడిచెను
లోకమే నిద్రించెను
విరహమింకను తాళలేను
వేగమె దరి చేరవా?

జాలి కొంచం చూపవా ..
జాబు అయినా పంపవా..
జాగు యేల రా రాఘవా?
క్షేమమా నా ప్రియతమా ??

కన్నె ఆశ

కళ్ళలో నిలుపుకుంటాను
కలలన్నీ నిజం చేస్తావా?

మనసులో చోటిస్తాను
మురిపాలు పంచిస్తావా?

కౌగిలిలో దాచుకుంటాను
కలకాలం తోడుంటావా?

తీగనై శ్రుతి కలుపుతాను
రాగాలు పలికిస్తావా?

పుడమినై పులకరిస్తాను
మేఘమై వర్షిస్తావా?

మన సంపద

పగలంతా తను పడిలేస్తూ
ప్రతి క్షణం పరుగులు తీస్తూ
ప్రపంచానికే వెలుగిచ్చే
బంగరు సూరీడు మనవాడు

చల్లని వెన్నెల కురిపిస్తూ
ప్రతి రేయీ జగతిని జోకొడుతూ
అలసిన కనులకు కలలను పంచే
అందరివాడూ నెలరాజు

పక్షుల కిలకిలా రావాలు
ఎం ఎస్ సుప్రభాతాలు
బిస్మిల్లా శెహ్నాయి మేళాలు
చిత్ర చిలిపి సరాగాలు
లత-ఆషాల గానాలు

అమ్మ నోటి దీవెనలు
చెమ్మగిల్లిన నాన్న కనులు
చెల్లాయితో గిల్లికజ్జాలు
బామ్మ చేతి బొబ్బట్లు

తీయని మాయని స్నేహాలు
దాచిన దాగని ప్రణయాలు
పెనవేసుకున్న అనుబంధాలు
ఇవే మన సిసలైన సంపదలు !!!

మధురం

మధురం మధురం సుమనోహరం .. నీ మనసే మకరందం
మధురం మధురం సుమనోహరం ..నీ తలపే కమనీయం

నింగిపైన జాబిల్లి,
ఇల తొంగిచూడదేం మళ్ళీ?
అందమైన నీ వదనం
సరిపోల్చలేను అనుకుందో!

మధురం మధురం సుమనోహరం .. నీ నయనం విరికమలం
మధురం మధురం సుమనోహరం .. నీ పలుకులో తీయదనం

నవ్వుతోంది మందారం
అది ఎందువల్లనంటావు?
నీ బుగ్గ మీద నునుసిగ్గు,
చేసింది ఇంద్రజాలం

మధురం మధురం సుమనోహరం .. ఎర్రని చెలి అధరం
మధురం మధురం సుమనోహరం .. చెలికాని దరహాసం

నాట్యమాడదేం నెమలి?
ఇది ఎందుకో తెలియాలి
నీ నడక చూసి అలిగిందో?
తను సాటిరాను అనుకుందో

మధురం మధురం సుమనోహరం నీ జతలో జీవనము ...
మధురం మధురం సుమనోహరం నీ ప్రణయం ఒక వరము ...